ఆర్థిక మాంద్యం టెక్కీల పాలిట శాపంగా మారుతోంది. ఏ క్షణంలో తమ ఉద్యోగం ఊడుతుందోనని క్షణక్షణం భయభయంగా కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలో డెల్ టెక్నాలజీస్ చేరింది.
డెల్ టెక్నాలజీస్ కంపెనీ 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డెల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5శాతం. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ కో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ వెల్లడించారు.
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పీసీల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐడీసీ తెలిపింది. డెల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయినట్లు వెల్లడించింది. 2022లో టెక్ రంగంలో 97,171 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ ఛాలెంజర్ తెలిపింది. 2021తో పోలిస్తే ఉద్యోగ కోతలు 649 శాతం పెరిగినట్లు పేర్కొంది.