తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్ పెట్టింది. రాహుల్ గాంధీని కలిసేందుకు రాజస్థాన్ లోని అల్వార్ కు బయలుదేరారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు, విభేదాలపై అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే సోమవారం రాత్రి రెండు గంటల పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు మాణిక్కం ఠాగూర్.
ఇక ఖర్గే సూచనతో భారత్ జోడో యాత్ర జరుగుతున్న రాజస్థాన్ లోని అల్వార్ లో రాహుల్ గాంధీని కలవనున్నారు మాణిక్కం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కు తాజా సమాచారం ఇవ్వడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దే ప్రణాళికపై చర్చించనున్నారు.
అటు తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదించే ప్రయత్నాల్లో అధిష్టానం ఉండగా, రంగంలోకి అధిష్టానం దూతలు దింపనుంది. దిగ్విజయ్‌సింగ్ లేదా పృథ్వీరాజ్ చౌహాన్‌కు బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.