లెనోవో కంపెనీ లిజియన్ సిరీస్‌లో 3 కొత్త ల్యాప్‌టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. లిజియన్ 7ఐ, లిజియన్ 5పై, లిజియన్ 5ఐ పేరిట ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. లిజియన్ 7ఐ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,99,990 ఉండగా, లిజియన్ 5పై ప్రారంభ ధర రూ.1,34,990గా ఉంది. అలాగే రూ.79,990 ప్రారంభ ధరకు లిజియన్ 5ఐ ల్యాప్‌టాప్ లభిస్తోంది. లిజియన్ 7ఐ, లిజియన్ 5ఐ ల్యాప్‌టాప్‌లను మరో వారం తరువాత నుంచి విక్రయిస్తారు. లిజియన్ 5పై ల్యాప్‌టాప్‌ను సెప్టెంబర్ నెలలో విక్రయిస్తారు.
గేమింగ్ ప్రియులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్ ఆర్టిస్టులను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌లను తీర్చిదిద్దారు. అందువల్ల ఆయా రంగాల్లోని వారికి ఈ ల్యాప్‌టాప్‌లు అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి. హెవీ డ్యూటీ టాస్క్‌లను కూడా వేగంగా నిర్వహించవచ్చు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఉంటుంది.
లిజియన్ 7ఐలో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, డాల్బీ విజన్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, ఇంటెల్లిజెంట్ కూలింగ్ సిస్టమ్, 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఫీచర్లను అందిస్తున్నారు. ఇంటెల్ కోర్ ఐ9 హెచ్ సిరీస్ 10వ జనరేషన్ మొబైల్ ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2080 సూపర్ గ్రాఫిక్ కార్డ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
కాగా లిజియన్ 5పై, 5ఐ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ ఐ7-10750హెచ్ 10వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన ఫీచర్లన్నీ దాదాపుగా లిజియన్ 7ఐలోనివే ఉన్నాయి.