సాధారణంగా మనలో అధిక శాతం మందికి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉంటాయి. గాలి కాలుష్యం, పొగ తాగడం, దుమ్ము, ధూళి ఉన్న వాతావరణంలో ఎక్కువగా గడపడం, అలర్జీలు.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అయితే కేవలం ఇవే కావు.. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించకపోయినా.. మనకు శ్వాసకోశ సమస్యలు వస్తాయట. అవును.. నిజమే.. సైంటిస్టుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మన శరీరంలో ఎల్లప్పుడూ జరిగే అనేక జీవక్రియలతోపాటు.. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు తగినంత నిద్ర కూడా అవసరమేనని సైంటిస్టులు చెబుతున్నారు. మన శరీరంలోని నాడీ మండల వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, గుండె, దాని సంబంధిత భాగాలు, శ్వాసకోశ వ్యవస్థలకు నిద్ర నేరుగా అనుసంధానమై ఉంటుందట. అందువల్ల తగినంత నిద్ర ఉంటే ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తాయని సైంటిస్టులు అంటున్నారు. ఇదే విషయాన్ని రెస్పిరేటర్ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే అమెరికన్ జర్నల్‌లోనూ ప్రచురించారు. మన శరీరంలో నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఆస్తమా పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు అంటున్నారు. నిద్రపోయేటప్పుడు విడుదలయ్యే మెలటోనిన్ శ్వాసనాళాల్లో ఉండే కండరాలను మృదువుగా చేస్తుంది. దీంతో వాపులు తగ్గుతాయి. ఆస్తమా పేషెంట్లకు శ్వాస సమస్యలు తగ్గుతాయి. అందువల్ల తగినన్ని గంటల పాటు నిద్రిస్తే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, అవి రాకుండా ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు.
ఇక నిద్ర సరిగ్గాపోని వారిలో మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతోపాటు శ్వాస సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 6 నుంచి 8 గంటల పాటు నిత్యం నిద్రించాలని, చిన్నారులకైతే 10 గంటల వరకు నిద్ర అవసరమని అంటున్నారు.