పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది అని కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో బీజేపీ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. చేవెళ్ల, మల్కాగ్‌జగిరి, నల్లగొండ, వరంగల్‌లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ నాయకులు అభ్యర్థులుగా ప్రకటించారు. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి ఒక్కరే ఒరిజినల్ బీజేపీ. కాబట్టి మన నేతలతోనే మనకు పోటీ నెలకొంది. బీజేపీకి అభ్యర్థులు లేరు.. కేడర్ దిక్కు లేదు అని కేటీఆర్ తెలిపారు. దేశంలో మోడీ హవా అంత బాగుంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు తీసుకెళ్తున్నారు.. చిన్న కార్యకర్తను పెట్టిన గెలవాలి కదా..? ఇవాళ మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోడీకి ఓటు వేద్దాం అని అంటున్నారు. హిందువులం కాబట్టి తప్పకుండా దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్లకు బీజేపీ ఏం చేసిందని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.