ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడినై బిజెపిలో చేరానని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. విజయవాడలోని బిజెపి ఆఫీసులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని అన్నారు. తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బిజెపి మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గం అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు 20 ఏళ్లు కష్టపడి పనిచేశానని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని కాంగ్రెస్ హై కమాండ్ కు ఆనాడు చెప్పినా వారు వినలేదని.. అందుకే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు శాంతిభద్రతల సమస్య తలెత్తలేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక బిజెపి హై కమాండ్ తనకి ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను స్వీకరిస్తానని స్పష్టం చేశారు. తాను పదవిని ఆశించి బిజెపిలో చేరలేదన్నారు.