బిగ్‌ బ్రేకింగ్: తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

-

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ 4.0లో పలు ఆంక్షలకు కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది. ఇక అంతకు ముందు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. అయితే ఇవే విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు కేబినెట్‌తో సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు…

lock down extended to may 31st in telangana

తెలంగాణలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో మే 29వ తేదీ వరకు ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలులో ఉండగా.. దాన్ని మరో 2 రోజులకు పొడిగించారు. ఇక కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగిలిన అన్ని జోన్లను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్‌టీసీ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులకు అనుమతించమని అన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులకు కూడా తెలంగాణలో అనుమతి లేదన్నారు.

క్యాబులు, ఆటోలను నడిపించుకోవచ్చని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కంటెయిన్మెంట్‌ జోన్లు తప్ప అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులను తెరుచుకోవచ్చని తెలిపారు. కాగా ఆర్‌టీసీ బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో కోవిడ్‌ 19 నిబంధనలను పాటించాలని అన్నారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకోవచ్చని, 100 శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని తెలిపారు. కానీ కరోనా నిబంధనలను పాటించాలని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని.. మాస్కులు ధరించని వారికి అధికారులు రూ.1000 ఫైన్‌ విధించాలని అన్నారు. షాపుల యజమానులు తమ షాపులను శానిటైజ్‌ చేయాలని, కస్టమర్లకు హ్యాండ్‌ శానిటైజేషన్‌ సదుపాయాలను అందుబాటులో ఉంచాని అన్నారు. ప్రజలు తమ ఇండ్ల వద్ద కరోనా జాగ్రత్తలను పాటించాలని, ఇంటిని, ఇండ్ల పరిసరాలను శుభ్రంగా  ఉంచుకోవాలని అన్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా చూడాలని కోరారు. అలాగే ప్రజలు అవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news