ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ కుమార్(72) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే మొరాదాబాద్ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. కున్వర్ సర్వేశ్ కుమార్ ఓటు కూడా వేశారు.
అనంతరం ఎయిమ్స్ చికిత్స కోసం చేరారు. ఓటింగ్ జరిగిన తర్వాతే రోజు సర్వేశ్ మరణించడం, ఆయన అనుచరులతోపాటు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. సర్వేశ్కు గొంతు సంబంధిత వ్యాధితో కొన్నిరోజులుగా బాధపడుతున్నారని, ఇటీవల ఆపరేషన్ కూడా జరిగిందని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరీ చెప్పారు. సర్వేశ్ కుమార్ మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు.
“మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ జీ మరణ వార్త విని షాక్ అయ్యాను. శ్రీరాముడి పాదాలపై చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు తగినంత శక్తి ఇవ్వాలి” అని యోగి ట్వీట్ చేశారు.