న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. పెగాసస్ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభ, లోక్‌సభలో పెగాసస్ వ్యవహారంపై చర్చ పెట్టాల్సిందేనని పట్టుబడ్డాయి. స్పీకర్ ఓం బిర్లా వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అటు రాజ్యసభలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. విపక్ష సభ్యుల నానాదాల మధ్య ఉభయసభలను సభాపతులు వాయిదా వేశారు.
కాగా విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. కరోనా విపత్తు వేళ ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. 2019 నుంచి ఎంఎస్ఎంఈల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు పలు చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈల కోసం అత్యవసర రుణ పథకం హామీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రుణ హామీ పథకంపై ఎంఎస్ఎంఈల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. రుణ హామీ పథకాన్ని అదనంగా రూ.1.5 లక్షల కోట్లుకు విస్తరించామని నిర్మలా స్పష్టం చేశారు.