ఎప్పటిలాగే ఈసారి కూడాహైదరాబాదీయులు బద్దకిస్టులుగా వ్యవహరించారు. తమ తలరాతను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో వారు మరోసారి వెనుకబడ్డారు. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థు.. ఇలా ఎవరు ఎంతగా ప్రచారం చేసినా నగర ఓటర్లు ఓటు వేసేందుకు ఇంటి గడప దాటలేదు. దీంతో మరోసారి గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మొత్తంగా చూస్తే పోలింగ్ శాతం తక్కువగానే ఉంది. అయితే పోలింగ్ శాతం తగ్గింది కనుక టీఆర్ఎస్‌కు మేలు కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం వల్ల టీఆర్ఎస్‌కు ఈ సారి మేలు కలుగుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తామే అధికారంలోకి వస్తామని భావిస్తున్నాయి. అయితే పోలింగ్ సరళని బట్టి చూస్తే తెరాస 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే బీజేపీ కొద్దిగా పుంజుకుని 15 నుంచి 20 కార్పొరేటర్ స్థానాలతో సరిపెట్టుకుంటుందని, కాంగ్రెస్‌కు 8 నుంచి 10 సీట్లు రావచ్చని, ఎంఐఎం మిగిలిన స్థానాల్లో వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన విడుదల కానున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే పోలింగ్ శాతం పెరిగి ఉంటే పెరిగే ఓట్లు అన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అయ్యే అవకాశం ఉంటుంది కనుక పోలింగ్ శాతం పెరిగే పక్షంలో బీజేపీ లేదా కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉండే చాన్స్ ఉందని భావించారు. కానీ పోలింగ్ శాతం తక్కువగానే ఉండడంతో మళ్లీ జనాలు తెరాసకే పట్టం కట్టి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలపై ఏ పార్టీ నాయకులు వారే తమకు తామే విజేతలమని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.