ఎల్‌పీజీ వినియోగదారులకు అలర్ట్‌.. గ్యాస్‌ డెలివరీ బంద్‌

-

మీ ఇంట్లోని ఎల్‌పీజీ గ్యాస్‌ అయిపోయిందా? వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఎల్‌పీజీ సిలిండర్‌ డెలివరీని ఆపేస్తామని గ్యాస్‌ పంపిణీ దారులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్యాస్‌ డెలివరీ చేసే ఏజెంట్లపై చాలా ప్రభావం పడుతోందని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల పలు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు షాకింగ్‌ విషయమే! ఎందుకంటే ఈ నిర్ణయంతో ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. తమల్ని కూడా ఫ్రంట్‌ లైన వారియర్స్‌గా గుర్తించాలని లేకపోతే ఎల్‌పీజీ హోం డెలివరీని నిలిపివేస్తామని ఇప్పటికే గ్యాస్‌ పంపిణీదారులు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే ఎల్‌పీజీ సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్‌ కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్స్‌ అసోసియేషన్ ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ చేపట్టకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్‌ సిలిండర్‌ హోమ్‌ డెలివరీ నిలిపేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కె.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది పంపిణీదారులకు వైరస్‌ సోకిందని , గ్యాస్‌ పంపిణీ చేసే వారు ప్రాణాలను లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి ఎల్‌పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ప్రభుత్వం పంపిణీ దారులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని కోరారు. తమకు అతి త్వరలోనే టీకాలు ఇప్పించాలని దీనివల్ల తమ ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదనే నమ్మకం తమకు కలుగుతుందని తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఏదేమైనా గ్యాస్‌ పంపిణీ నిలిచిపోతే మళ్లీ ఆ ప్రభావం సామాన్యులకు ఇక్కట్లను తెచ్చిపెడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news