కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. కార్మికులకు ఉపాధి కరువైంది. ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. విమానయాన రంగమైతే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలను చవి చూస్తోంది. ఇక ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టగా.. తాజాగా ఆ జాబితాలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా వచ్చి చేరింది. ఆ సంస్థ తమ కంపెనీలోని 22వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ జర్మన్ ఎయిర్‌లైనర్ లుఫ్తాన్సా.. 22వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కోవిడ్ 19 దృష్ట్యా తమ కంపెనీ తిరిగి కోలుకునే అవకాశాలు లేవని.. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని ఆ కంపెనీ తెలియజేసింది. కాగా జర్మనీలో ఇప్పటికే 1.87 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 1.71 లక్షల మంది రికవరీ అయ్యారు. మరో 8,845 మంది చనిపోయారు.
ఇక ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అయిన దేశాల్లో జర్మనీ 9వ స్థానంలో ఉంది. అక్కడ కరోనా వల్ల అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడప్పుడే అక్కడ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడే అవకాశం లేదని అక్కడి నిపుణులు అంటున్నారు.