మా ఎన్నికలు – ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి శివబాలాజీ విజయం

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ’మా‘ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. ఈసీ మెంబర్ల ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, విష్ణు ప్యానెళ్ల మధ్య మెజారీటీ క్షణక్షణం మారుతోంది. తాజాగా ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి శివబాలాజీ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి నాగినీడుపై విజయం సాధించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముందు నుంచి శివబాలాజీ, నాగినీడుపై ఆధిక్యత కనబరుస్తున్నారు. తాజాగా విజయం ఖరారైనట్లు సమాచారం.

 అయితే ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు జనరల్ సెక్రటరీ రేసులో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న జీవితపై మంచువిష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న రఘుబాబు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సమయంలో ఇరు వర్గాల మధ్య లీడ్ క్షణక్షణం మారుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠత కలుగుతోంది. మరోవైపు ఈసీ సభ్యుల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 8 మంది, మంచు విష్ణు ప్యానెల్ నుంచి 10 మంది లీడ్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.