మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కమల్‌నాథ్ సర్కారుకు బలపరీక్ష ఉంటుందని గవర్నర్ లాల్జీ టాండన్ ఇది వరకు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు కాగా గవర్నర్ ప్రసంగం అనంతరం బలపరీక్ష జరుగుతుందని అందరూ విశ్వసించారు. అయితే నాటకీయ పరిణామాల నడుమ అసెంబ్లీని మార్చి 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి వెల్లడించారు. దీంతో కమల్‌నాథ్ సర్కారు ప్రస్తుతం గండం నుంచి గట్టెక్కింది.
కాంగ్రెస్ ముఖ్య నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన వర్గంగా పేరున్న 22 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించారు. అయితే 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. దీంతో మెజారిటీ మార్క్ 112కు చేరుకుంది. అయితే సభలో బీజేపీకి 107 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు 108 మంది సభ్యులు ఉన్నారు. దీంతో బలపరీక్షపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పోరాడింది. అయితే స్పీకర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది.
కాగా కరోనా వైరస్ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రజాపతి తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించామని, అందుకే బలపరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు.