కరోనా నేపథ్యంలో ఒక దశలో పెళ్లిళ్లు, శుభ కార్యాలకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేశాక పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం అతిథుల హాజరుకు పరిమితి లేదు. ఎంత మంది అయినా శుభ కార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ వధూవరులు మాత్రం కరోనా విషయమై ఇంకాస్త ఎక్కువగానే జాగ్రత్త పడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
వధూవరులకు సహజంగానే వివాహం సందర్బంగా అతిథులు డబ్బును కట్నంగా ఇస్తుంటారు. అలాగే కొందరు వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. అయితే డబ్బులను ఇచ్చేవారి కోసం మదురైకి చెందిన ఓ జంట వినూత్న ప్రయోగం చేసింది. డబ్బును నేరుగా ఇవ్వాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా వారు వెడ్డింగ్ కార్డుపై క్యూ ఆర్ కోడ్‌లను ప్రింట్ చేశారు.
వెడ్డింగ్ కార్డులపై ఆ జంటకు చెందిన గూగుల్ పే, ఫోన్ పే క్యూ ఆర్ కోడ్‌లను ప్రింట్ చేశారు. దీంతో అతిథులు క్యాష్ ఇవ్వాల్సిన పనిలేకుండా పోయింది. నేరుగా వారి అకౌంట్లకే నగదును బదిలీ చేసే అవకాశం కలిగింది. దీంతో కరోనా వస్తుందనే భయం కూడా ఉండదు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా వారు ముద్రించిన ఆ వెడ్డింగ్ కార్డులకు చెందిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక పెళ్లికి రాలేకపోయినా 30 మంది ఆ దంపతులకు మాత్రం కట్నాలను ఆన్‌లైన్‌లోనే ట్రాన్స్ ఫర్ చేశారు. నిజంగా ఈ ఐడియా ఏదో బాగుంది కదా.