టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు భద్రతను కుదిస్తూ మహారాష్ట్రలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచిన్ కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై సచిన్‌కు 24 గంటల భద్రత ఉండదు. ఎస్కార్ట్ సదుపాయం మాత్రం ఉంటుంది. ఇదిలా ఉంటే.. శివసేన నాయకుడు, సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆదిత్యఠాక్రేకు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించారు. గతంలో వై ప్లస్ కేటగిరి భద్రత ఉండగా దాన్ని జడ్ కేటగిరికి పెంచారు. బీజేపీ నాయకుడు ఏక్ నాథ్ ఖాడ్సేకు గతంలో ఉన్న వై కేటగిరితోపాటు ఎస్కార్టు భద్రతను కుదించారు.
మాజీ బీజేపీ నాయకుడు, యూపీ మాజీ గవర్నరు రాంనాయక్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీని ఎక్స్ కేటగిరికి తగ్గించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికంకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను వై కేటగిరికి తగ్గించారు. మహారాష్ట్రలో 97 మంది నాయకులకు సెక్యూరిటీ ఉండగా, 29 మంది నేతల భద్రతను మార్చారు. కొంతమంది నేతలకు థ్రెట్ పర్సెప్షన్ ను బట్టి భద్రతను తగ్గించగా, మరికొంతమందికి భద్రతను పెంచారు.