మ‌హారాష్ట్ర ఉపాధ్యాయుడికి గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్‌.. రూ.7.37 కోట్లు గెలిచాడు..

-

మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లా ప‌రితెవ‌డి గ్రామానికి చెందిన 32 ఏళ్ల రంజిత్ సిన్హ్ దిస‌లె గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ 2020ని గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో 1 మిలియ‌న్ డాల‌ర్ల‌ (సుమారుగా రూ.7.37 కోట్లు) ప్రైజ్ మ‌నీ అత‌నికి ల‌భించింది. ఉపాధ్యాయ వృత్తిలో ఆయ‌న అందించిన అసాధార‌ణ సేవ‌ల‌కు గాను ఆ అవార్డు ఆయ‌న‌కు ల‌భించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి 12వేల మంది ఈ ప్రైజ్‌కు పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు రంజిత్‌ను ఈ ప్రైజ్ వ‌రించింది.

maharashtra teacher won 1 million dollars

కాగా రంజిత్ 2009లో ప‌రితెవ‌డి గ్రామంలో ఉన్న జిల్లా ప‌రిష‌త్ ప్రైమ‌రీ స్కూల్‌కు టీచ‌ర్‌గా వ‌చ్చాడు. అప్ప‌ట్లో స్కూల్ ప‌రిస్థితి దారుణంగా ఉండేది. శిథిలావ‌స్థ‌కు చేరిన నిర్మాణాలు క‌నిపించాయి. త‌ర‌గ‌తి గ‌దులు ప‌శువుల‌కు ఆవాసాలుగా మారాయి. దీంతో రంజిత్ స్కూల్‌ను బాగు చేయించాడు. ఇక విద్యార్థుల హాజ‌రు శాతాన్ని పెంచేందుకు ఎంతో ప్ర‌య‌త్నం చేశాడు. అందుకు గాను పాఠాల‌ను వారికి అర్థ‌మ‌య్యేలా వారి మాతృభాష‌లో బోధించేవాడు. అలాగే పుస్త‌కాల‌ను కూడా అదే భాష‌లోకి అనువ‌దించాడు. దీంతోపాటు పుస్తకాల‌పై క్యోఆర్ కోడ్‌ల‌ను అమ‌ర్చేవాడు. దీంతో వాటి ద్వారా విద్యార్థులు ఆడియో పోయెమ్స్, వీడియో లెక్చ‌ర్లు, స్టోరీలు వినేవారు. అసైన్‌మెంట్లు కూడా పూర్తి చేసేవారు. ఇలా అనేక విప్ల‌వాత్మ‌క మార్పులను ఆయ‌న తీసుకొచ్చాడు. అయితే ఆ క్యూఆర్ కోడ్ విధానం ఎంతో బాగుండే స‌రికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం దాన్ని 2017 నుంచి అక్క‌డ అమ‌లు చేస్తోంది.

రంజిత్ అమ‌లు చేసిన అనేక మార్పుల వ‌ల్ల స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పెర‌గ‌డ‌మే కాదు, డ్రాప‌వ‌ట్లు త‌గ్గాయి. ముఖ్యంగా బాలిక‌లు ఎక్కువ‌గా స్కూల్‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో రంజిత్ చేస్తున్న అనేక సేవ‌ల‌కు గాను అత‌ను గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యాడు. చివ‌రి రౌండ్‌లో ప‌లు దేశాల‌కు చెందిన 10 మంది టీచ‌ర్ల‌లో అత‌నూ ఉన్నాడు. వారిని కాద‌ని రంజిత్‌కు ఈ ప్రైజ్ ద‌క్క‌డం విశేషం.

ఇటీవ‌లే లండ‌న్‌లోని నాచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియం నుంచి ఏర్పాటు చేసిన వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో రంజిత్ ఆ ప్రైజ్ ను అందుకున్నాడు. ప్ర‌తి ఏటా ఈ ప్రైజ్‌ను వార్కే ఫౌండేష‌న్ అందిస్తోంది. అయితే రంజిత్ త‌న‌కు వ‌చ్చిన 1 మిలియ‌న్ డాల‌ర్ల‌లో స‌గం మొత్తాన్ని ఫైన‌ల్‌కు చేరిన 10 మందికి స‌మానంగా ఇస్తున్న‌ట్లు తెలిపాడు. ఆ మొత్తంతో వారు త‌మ త‌మ దేశాల్లో పేద విద్యార్థుల చ‌దువు కోసం స‌హాయం అందించాల‌ని ఆయ‌న కోరాడు. కాగా రంజిత్‌కు ఈ ప్రైజ్ రావ‌డంపై నెటిజ‌న్లు కూడా అత‌న్ని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news