సభ్య సమాజం తలదించుకునే ఘటన. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, రక్షణ ఇవ్వాల్సిన అన్న, తాత, మేనమామ ఇలా అంతా కీచకులుగా మారారు. ఐదేళ్ల నుంచి ఈ అఘాయిత్యాన్ని మౌనంగా భరిస్తోంది ఆ చిట్టి తల్లి. చివరకు నోరు విప్పి తనకు జరిగిన అన్యాయాన్ని పాఠశాలలో టీచర్ల ద్రుష్టికి తీసుకెళ్లింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర పూణే లో బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై సొంత తండ్రి, సోదరుడు, తాతా, మేనమామ ఒకరికి తెలియకుండా ఒకరు లైంగిక దాడి చేస్తున్నారు. 11 ఏళ్ల సోదరుడు కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడటం షాకింగ్ కలిగిస్తోంది. బీహార్ కు చెందిన ఓ కుటుంబం కొంత కాలం క్రితం పుణే వచ్చారు. అక్కడే బాలిక చదువుకుంటోంది. అయితే ఇటీవల పాఠశాలలో ‘ గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పై మాట్లాడుతూ… తనకు జరిగిన అన్యాయం గురించి పెదవి విప్పింది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం పోలీసుకు ఫిర్యాదు చేసింది. 2017లో బీహార్ లో ఉన్నప్పటి నుంచే బాలిక తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీస్ అధికారి అశ్విని సత్పుటే చెప్పారు. ఘటనలో పాలుపంచుకున్న వారందరిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
బాలిక సోదరుడు మరియు తండ్రి (45)పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు నమోదు కాగా, ఆమె తాత (వయసు దాదాపు 60 ఏళ్లు) మేనమామ (సుమారు 25 ఏళ్లు)పై సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసులు పెడతామని పోలీసులు వెల్లడించారు.