కోవిడ్ 19 పేషెంట్ల కోసం బీఎస్ 6 సుప్రో ఆంబులెన్స్‌… మ‌హీంద్రా నుంచి..!

-

ప్ర‌ముఖ ఆటోమొబైల్ త‌యారీదారు మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా నూత‌న ఆంబులెన్స్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం మార్కెట్‌లో విడుద‌ల చేసింది. బీఎస్‌6 సుప్రో ఆంబులెన్స్ పేరిట ఆ ఆంబులెన్స్ విడులైంది. ఇది మ‌హీంద్రా సుప్రో వ్యాన్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇక మొద‌టి బ్యాచ్ కింద ఉత్ప‌త్తి చేయ‌బ‌డే ఈ ఆంబులెన్స్‌ల‌ను ముందుగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆ కంపెనీ అందించ‌నుంది. కాగా ఈ ఆంబులెన్స్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.6.94 ల‌క్ష‌లు ఉండ‌గా, ఎల్ఎక్స్‌, జ‌డ్ఎక్స్ వేరియెంట్ల‌లో ఇది ల‌భిస్తోంది.

mahindra launched bs6 supro ambulance for covid 19 patients

సుప్రో ఆంబులెన్స్‌లో పేషెంట్ల‌కు అత్య‌వ‌స‌ర‌, సాధార‌ణ స్థితిలో అందించే వైద్య సేవ‌ల‌కు సంబంధించిన దాదాపు అన్ని ర‌కాల అధునాత‌న సౌక‌ర్యాలు ఉంటాయి. నూత‌న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య ప‌రిక‌రాలు, ఫోల్డ‌బుల్ స్ట్రెచ‌ర్ క‌మ్ ట్రాలీ, మెడిక‌ల్ కిట్ బాక్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విష‌ర్ త‌దిత‌ర ప‌రిక‌రాలు ఈ ఆంబులెన్స్‌లో ఉంటాయి. ఇందులో ఇంట‌ర్న‌ల్ లైటింగ్‌ను అందిస్తున్నారు. అలాగే అగ్ని ప్ర‌మాదాల‌ను త‌ట్టుకునే విధంగా ఫ్లేమ్ రెసిస్టెంట్ ఇంటీరియ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఆంబులెన్స్ 47 బేసిక్ హార్స్ ప‌వ‌ర్‌ను క‌లిగి ఉంటుంది. మ‌హీంద్రా డీఐ ఇంజిన్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ వాహ‌నానికి 2 ఏళ్లు లేదా 60వేల కిలోమీట‌ర్ల వ‌ర‌కు వారంటీ ల‌భిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌ను అందిస్తున్నారు. ఇందులో పేషెంట్, డ్రైవ‌ర్ కాకుండా 5 మంది కూర్చోవ‌చ్చు. భార‌తీయ ర‌హ‌దారుల‌కు అనుగుణంగా, ట్రాఫిక్‌లోనూ సుల‌భంగా వెళ్లేందుకు వీలుగా ఈ ఆంబులెన్స్‌ను తీర్చిదిద్దారు.

కాగా మొద‌టి విడ‌త‌లో భాగంగా మొత్తం 12 సుప్రో ఆంబులెన్స్‌లు ప్ర‌స్తుతం ముంబైలో ప‌రుగులు పెట్ట‌నున్నాయి. కోవిడ్ 19 రోగుల‌ను త‌ర‌లించేందుకే ప్ర‌త్యేకంగా వీటిని ఉప‌యోగించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news