మల్కాజ్ గిరి నియోజకవర్గంలో నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భరతమాత ఫోటో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఎమ్మెల్యే అనుచరులు కార్పొరేట్ శ్రవణ్ పై దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలతో కలిసి బిజెపి కార్పొరేటర్ శ్రవణ్.. మైనంపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఇక బిజెపి కార్పొరేట్ శ్రవణ్ ఆస్పత్రిలో ఉండగా బండి సంజయ్ మరియు బిజెపి నాయకురాలు విజయశాంతి పరామర్శించారు. ఇదిలా ఉంటే ఈ రోజు కార్పొరేటర్ పై దాడికి నిరసనగా బిజెపి కార్యకర్తలు మల్కాజ్ గిరి బంద్ కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలను ముందుగానే అరెస్టు చేశారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు ఇంటిముందు బిజెపి మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. కానీ పోలీసులు వారిని అరెస్టు చేశారు.