అసలే పండుగల సీజన్.. సహజంగానే ఈ సమయంలో మార్కెట్లలో రద్దీ నెలకొంటుంది. జనాలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తూ సందడి చేస్తారు. ఇక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు ఏవైనా సరే పండుగ సీజన్ కనుక విక్రయదారులకు ఈ సీజన్‌లో బాగానే గిరాకీ ఉంటుంది. అయితే కరోనా వల్ల ఈసారి పండుగ సీజన్ లో వ్యాపారం సరిగ్గా ఉంటుందా, ఉండదా అని వ్యాపారులు భయపడ్డారు. కానీ వారికి ప్రస్తుతం ఆ భయాలేవీ లేవు. ఎందుకంటే కరోనా ఉన్నప్పటికీ జనాలు అదేమీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అనేక నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా పండుగ సీజన్ హడావిడి నెలకొంది.
ఇక జనాలను ఆకర్షించేందుకు దుస్తుల షాపుల వారు ఎప్పటిలా ఈ సారి కూడా భారీ రాయితీలు, ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. దీంతో జనాలు షాపింగ్ మాల్స్ వద్ద క్యూలు కడుతున్నారు. కాగా చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న కుమరన్ సిల్క్స్ మాల్ తాజాగా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మాల్‌లో జనాలు సందు లేకుండా షాపింగ్‌కు వచ్చారు. మాల్‌లో ఇసుక వేస్తే రాలనంత జనం జమయ్యారు. కోవిడ్ రూల్స్‌కు మంగళం పాడారు. ఇంకేముందీ.. పోలీసులు కలగజేసుకోక తప్పలేదు.
This video of a big crowd of saree shoppers inside Chennai’s famous Kumaran Silks in T.Nagar has forced a shutdown for violation of Covid19 rules. pic.twitter.com/SvrdAlKJZV
— Shiv Aroor (@ShivAroor) October 20, 2020
పెద్ద ఎత్తున జనాలు గుమిగూడేందుకు కారణమయ్యారంటూ కుమరన్ సిల్క్స్ మాల్‌ను ప్రస్తుతం అక్కడి పోలీసులు, అధికారులు బలవంతంగా మూయించారు. జనాలు భారీగా ఒకే చోట గుమిగూడడమే కాక కోవిడ్ రూల్స్ ను కూడా పాటించలేదని, అందుకనే మాల్‌ను మూయించామని అధికారులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.