సమోసా.. పేదవాడి స్నాక్.. జేబులో భోజనం చేసేందుకు డబ్బులు లేకపోతే సమోసా కొని తింటే చాలు.. కడుపు నిండిపోతుంది. ప్రయాణాల్లో అయితే సమోసాను బెస్ట్ స్నాక్‌గా చాలా మంది తిని ఎంజాయ్ చేస్తారు. ఇక మహా అయితే సమోసా ధర ఎంత ఉంటుంది. చిన్న సమోసా అయితే రూ.5, పెద్దది అయితే రూ.10 వరకు ఉంటుంది. కానీ గోవా ఎయిర్‌పోర్టులో సమోసా రేటు ఎంతో తెలిస్తే.. మీరు నోరెళ్లబెడతారు. ఎందుకంటే.. అక్కడ ఒక్క సమోసాను కొనుగోలు చేసే బదులు మన హైదరాబాద్ నగరంలో ఓ మోస్తారు రెస్టారెంట్‌లో మినీ బిర్యానీనే తినేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈపాటికే మీకు సమోసా రేటు అర్థమైపోయి ఉంటుంది. అది అక్షరాలా రూ.90. జీఎస్‌టీతో అయితే రూ.16 కలుపుకుని రూ.106 అవుతుంది.
గోవా ఎయిర్‌పోర్టులో ఇటీవలే ఓ వ్యక్తి రెండు సమోసాలను కొనుగోలు చేశాడు. ఒక్కో సమోసా ధర రూ.90. రెండు సమోసాలకు రూ.180. రెండింటికీ కలిపి జీఎస్‌టీ రూ.32. దీంతో మొత్తం కలిపి రూ.212 అయింది. అయితే ఆ బిల్లును చూసి అతను అవాక్కయ్యాడు. రెండు సమోసాలకు రెండు వందల రూపాయలు చెల్లించేసరికి అతనికి షాక్ కొట్టినట్లయింది. దీంతో అతను ఆగలేదు. వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అలా ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన బిల్లు ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ బిల్లు పట్ల చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అంత మొత్తాన్ని చెల్లించి కేవలం రెండు సమోసాలు తినేబదులు చక్కని భోజనం చేయవచ్చు కదా.. అని కొందరు కామెంట్ చేస్తే.. ఎయిర్‌పోర్టులు, సినిమా హాళ్లలో ఆహార పదార్థాల ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు. ఏది ఏమైనా.. అలాంటి ప్రదేశాల్లో చిన్నపాటి స్నాక్స్ ధరలే ఇలా ఆకాశాన్ని అంటితే.. ఇక భోజనం ధర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా..!