భారత దేశంలో న్యాయవ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుందో చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. చేయని తప్పుకు ఓ వ్యక్తి 20 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తూ వస్తున్నాడు. కానీ ఎట్టకేలకు అతన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో త్వరలో అతను విడుదల కానున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ గ్రామానికి చెందిన విష్ణు తివారి మీద అదే గ్రామానికి చెందిన ఓ మహిళ 2000వ సంవత్సరంలో అత్యాచారం చేసినట్లు కేసు పెట్టింది. దీంతో పోలీసులు విష్ణును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అయితే అప్పట్లో సాక్ష్యాలు అన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో అతనికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. అప్పుడు విష్ణు వయస్సు 23 ఏళ్లు.
అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో అతను పలు మార్లు భిన్న కోర్టుల్లో్ అప్పీల్ చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక గతేడాది హైకోర్టులో అప్పీల్ చేశాడు. దీంతో మళ్లీ కేసు విచారణ జరిగింది. అయితే తీరా చూస్తే అప్పట్లో అసలు ఆ మహిళపై అత్యాచారం జరగలేదని వైద్యులు ఇచ్చిన నివేదికల్లో వెల్లడైంది. ఆ మహిళ కుటుంబానికి, విష్ణు కుటుంబానికి మధ్య భూముల విషయంలో గొడవలు ఉండేవని, దీంతో ఆ మహిళకు చెందిన కుటుంబ సభ్యులు విష్ణుపై అక్రమంగా కేసు పెట్టారని, ఆ మహిళ కేసు పెట్టలేదని తేలింది. దీంతో న్యాయమూర్తి విష్ణును నిర్దోషిగా ప్రకటించారు. ఈ క్రమంలో విష్ణు త్వరలో విడుదల కానున్నాడు. జైలు నుంచి బయటకు రాగానే అతను ధాబా తెరిచి జీవిస్తానని చెప్పాడు. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో అతను తన తండ్రిని, ఇద్దరు సోదరులను కోల్పోయాడు. స్వతహాగా అతను మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని గ్రామస్తులు తెలిపారు. జైల్లోనూ అతను చాలా మర్యాదగా, చక్కని ప్రవర్తనను కలిగి ఉండే వాడని, అతను ఇలా 20 ఏళ్లు అన్యాయంగా జైల్లో ఉండడం బాధాకరమని పోలీసు అధికారులు తెలిపారు.