పామును అద్దెకు తీసుకుని భార్య‌కు కాటు వేయించి చంపాడు.. కిరాత‌కుడు..

-

నేరస్థులు తాము ఏం చేసినా, ఎలా చేసినా పోలీసుల‌కు తెలియ‌దులే.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టుకోలేరులే.. అన్న ధీమాలో ఉంటారు. కానీ వారు చేసిన నేరం ఎల్ల‌కాలం దాగ‌దు. ఎప్ప‌టికైనా బ‌య‌టప‌డే తీరుతుంది. స‌రిగ్గా కేర‌ళ‌లోనూ ఇలాగే జ‌రిగింది. ఓ వ్య‌క్తి పామును అద్దెకు తీసుకుని త‌న భార్య‌కు దాంతో కాటు వేయించి చంపాల‌ని అనుకున్నాడు. మొద‌టిసారి ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. అయితే రెండో సారి మాత్రం ఆ అభాగ్యురాలు భ‌ర్త కుటిల‌త్వాన్ని తెలుసుకోలేక‌పోయింది. దీంతో పాము కాటుకు బ‌లైంది.

man killed his wife with snake bite

కేర‌ళ‌లోని ప‌థ‌నంథిట్ట జిల్లా అడూర్ ప్రాంతానికి చెందిన సూర‌జ్ అనే ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగికి, మ‌రో యువ‌తి (25)కి 2 ఏళ్ల కింద‌ట వివాహం అయింది. అందులో భాగంగానే సూర‌జ్‌కు భారీగా క‌ట్నం కూడా ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను సంతృప్తి చెందలేదు. దీంతో వారి వైవాహిక జీవితంలో ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. అయితే సూర‌జ్ ఎలాగైనా త‌న భార్య‌ను చంపాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే పాముల‌ను ఎలా ప‌ట్టాలి, వాటితో మ‌నుషుల‌ను కాటేయించి ఎలా చంపాలి ? అనే విష‌యాల‌ను యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు.

అనంతరం సూర‌జ్.. సురేష్ అనే ఓ పాములు ప‌ట్టే వ్య‌క్తి నుంచి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌స్సెల్స్ వైప‌ర్ అనే పామును అద్దెకు తీసుకున్నాడు. మార్చి 2న ఆ పాముతో ఆమెకు కాటు వేయించాడు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఆమెను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. దీంతో ఆమె హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ కోలుకుంది. ఏప్రిల్ 22న ఆమెను డిశ్చార్జి చేశారు. అయిన‌ప్ప‌టికీ సూర‌జ్ మ‌రోసారి పాముతో ఆమెను కాటు వేయించాల‌నుకున్నాడు. మ‌ళ్లీ సురేష్‌ను క‌లిసి ఈసారి తాచుపామును అద్దెకు తీసుకున్నాడు. అనంత‌రం త‌న భార్య నిద్రిస్తున్న స‌మ‌యంలో ఆ పామును ఆమెపై వ‌దిలాడు. దీంతో ఆ పాము ఆమెను రెండు సార్లు కాటు వేసింది. ఆ విష‌యాన్ని నిర్దారించుకున్న సూర‌జ్ పామును తీసుకుని దాన్ని తిరిగి సురేష్‌కు అప్ప‌గించాడు. ఈ సంఘ‌ట‌న మే 7వ తేదీన చోటు చేసుకుంది. అయితే ఈ సారి మాత్రం ఆమె బ‌త‌క‌లేదు. పాము కాటుకు చ‌నిపోయింది. దీంతో అంద‌రూ ఆమె పాము కాటు వ‌ల్ల మ‌ర‌ణించింద‌ని అనుకున్నారు. కానీ ఆమె త‌ల్లిదండ్రుల‌కు మాత్రం అనుమానం వ‌చ్చింది.

త‌మ కుమార్తెను ఒక‌సారి పాము క‌రిచిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రొక‌సారి ఆమెను పాము క‌ర‌వ‌డం.. ఆమె చ‌నిపోవ‌డం జ‌రిగే స‌రికి ఆమె త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సూర‌జ్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. ఈ క్ర‌మంలో సూర‌జ్‌ను వారు అరెస్టు చేశారు. అలాగే అత‌నికి స‌హ‌క‌రించిన సురేష్‌పై కేసు న‌మోదు చేసి అత‌న్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సురేష్‌పై క్రిమిన‌ల్ కేసుతోపాటు వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఏది ఏమైనా.. ఓ కిరాత‌కుడి పాపానికి ఓ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news