ఆన్‌లైన్‌లో ఒక్కోసారి సహజంగానే మనం ఒక వస్తువును ఆర్డర్ చేస్తే.. మరొక వస్తువును డెలివరీ చేస్తుంటారు. ఈ తరహా పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనకు విసుగు వస్తుంది. ఆ ప్రొడక్ట్‌ను వారు వెనక్కి తీసుకుని మళ్లీ మనకు కావల్సిన వస్తువును పంపిస్తారు. లేదా మన డబ్బు మనకు రిటర్న్ చేస్తారు. అయితే అమెజాన్ మాత్రం ఆ వ్యక్తి విషయంలో భిన్నంగా ప్రవర్తించింది. అతను రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే అతనికి రూ.19వేల విలువైన ఇయర్‌బడ్స్ వచ్చాయి. అయితే అతను రిటర్న్ చేస్తానని చెబితే.. అందుకు అమెజాన్ వద్దని చెప్పింది. అవును.. ఇది నిజమే. షాకింగ్‌గా ఉన్నా.. నిజంగా ఈ సంఘటన జరిగింది.
గౌతం రెజె అనే ఓ వ్యక్తి అమెజాన్‌లో రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేశాడు. అయితే అతనికి రూ.19వేల విలువైన బోస్ కంపెనీకి చెందిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వచ్చాయి. దీంతో అతను కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. అయితే వారు ఆ ఇయర్‌బడ్స్‌ను ఉంచుకోమని చెప్పారు. ఎందుకంటే అతను ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ నాన్ రిటర్నబుల్ జాబితాలోకి వస్తుంది. దాన్ని రిటర్న్ చేసుకోవడం కుదరదు. కనుక ఆ ఇయర్‌బడ్స్‌ను అతను ఉంచుకోవచ్చని అమెజాన్ ప్రతినిధి తెలిపాడు. దీంతో అంతటి ఖరీదైన ఇయర్‌బడ్స్ గౌతం రెజెకు ఉచితంగా లభించినట్లయింది.
Bose wireless earbuds (₹19k) delivered instead of skin lotion (₹300). @amazonIN support asked to keep it as order was non-returnable! 🤪🤦♂️🥳 pic.twitter.com/nCMw9z80pW
— Gautam Rege (@gautamrege) June 10, 2020
ఇక తప్పుడు వస్తువును డెలివరీ చేసినందుకు గాను అమెజాన్ అతనికి రూ.300 నగదును రీఫండ్ కూడా చేసింది. అయితే ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. దానికి ఇప్పటికే 20వేలకు పైగా లైక్‌లు, 4వేల వరకు రీట్వీట్‌లు వచ్చాయి. దీంతో ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. ఈ విషయంలో గౌతంను చాలా లక్కీ అని చెప్పవచ్చు కదా..!