కేరళ రాష్ట్రంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. దీంతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 37 మంది వరదల వల్ల ప్రాణాలను కోల్పోయారు. అనేక గ్రామాలు నీట మునిగాయి. వేలామంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొని ప్రజలను తరలిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇడుక్కి నదిలో నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఆ నదిపై ఉండే బ్రిడ్జ్ పైకి పెద్ద ఎత్తున నీరు వచ్చింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఓ బాలుడికి ఏం చేయాలో తెలియలేదు. దీంతో ఆ బాలున్ని గమనించిన ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కన్హయ కుమార్ వెంటనే పరుగెత్తి ఆ బాలున్ని పట్టుకుని ఆ బ్రిడ్జిపై నుంచి పరుగెత్తాడు. అయితే అలా కన్హయ కుమార్ బ్రిడ్జి దాటిన వెంటనే ఆ బ్రిడ్జ్ కూలిపోయింది.
మనం అనేక సినిమాల్లో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలను చూస్తూనే ఉంటాం. నటులు అలాంటి ప్రమాదకర సమయాల్లో కూలిపోతున్న బ్రిడ్జిని వేగంగా ఎలా దాటుతారో కన్హయ కుమార్ అలాగే బ్రిడ్జిని దాటాడు. దీంతో అతని సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేసినా పిల్లవాడి ప్రాణాలతోపాటు కన్హయ కుమార్ ప్రాణాలు కూడా పోయి ఉండేవి. కానీ అతని సాహసం, సమయస్ఫూర్తి ఇద్దరి ప్రాణాలను కాపాడాయి. దీంతో సోషల్ మీడియాలో కన్హయ కుమార్ ఆ బాలున్ని కాపాడిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా.. అతను చేసిన ఆ పనికి అతన్ని అందరం అభినందించాల్సిందే..!