ఫ్రెండ్‌షిప్ డే అంటే.. ఆ రోజున స్నేహితులందరూ ఒకరికొకరు బ్యాండ్స్ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇక కొందరు బహుమతులు గట్రా ఇచ్చుకుంటారు. కానీ.. ఇవన్నీ రొటినే కదా.. అనో లేదంటే.. మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఓ 10వ తరగతి విద్యార్థి మాత్రం తన స్నేహితులకు ఏకంగా రూ.46 లక్షలను పంచేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సంఘటన మధ్యఫ్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి తన తండ్రి సొమ్ము రూ.46 లక్షలను ఇంట్లో నుంచి కాజేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని తన స్నేహితులకు పంచేశాడు. తన హోం వర్క్ చేసినందుకు ఓ స్నేహితుడికి రూ.3 లక్షలను ఇచ్చాడు. ఇక కూలీ పని చేసే ఓ వ్యక్తి కుమారుడికి రూ.15 లక్షలను ఇచ్చాడు. ఇలా మొత్తం 35 మంది క్లాస్‌మేట్స్‌కు రూ.46 లక్షలను పంచాడు. దీంతో ఆ విద్యార్థి స్నేహితులు కొందరు విలువైన వస్తువులు కొనగా, ఒక విద్యార్థి ఏకంగా కారునే కొన్నాడు.
అయితే సదరు విద్యార్థి తండ్రి ఓ బిల్డర్. తనకు ఓ ప్రాపర్టీ అమ్మకం ద్వారా రూ.60 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోని కప్‌బోర్డులో పెట్టాడు. అందులోంచే ఆ విద్యార్థి రూ.46 లక్షలను దొంగిలించి తన స్నేహితులకు ఇచ్చేశాడు. ఈ క్రమంలో డబ్బులు పోయిన విషయం తెలుసుకున్న ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ విద్యార్థి డబ్బులు దొంగిలించి తన స్నేహితులకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు ఆ విద్యార్థి స్నేహితుల నుంచి రూ.15 లక్షల వరకు రాబట్టారు. వారి తల్లిదండ్రులను పిలిచి వారి పిల్లలు తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేయాలని చెప్పారు. అయితే ఆ విద్యార్థులు మైనర్లు అయినందున వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా.. నిజంగా ఇది షాకింగ్ సంఘటనే కదా..!