దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 43కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి వచ్చిన 63 ఏళ్ల ఓ జమ్మూ కాశ్మీర్ మహిళకు, ఇటలీ నుంచి వచ్చిన దంపతులకు చెందిన ఓ 3 ఏళ్ల చిన్నారికి తాజాగా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. కాగా దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియగా, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఆదివారం సాయంత్రం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ఎయిర్‌పోర్టులో సిబ్బంది గుర్తించి అతన్ని సమీపంలో ఉన్న వెన్‌లోక్ హాస్పిటల్‌కు తరలించాలని యత్నించారు. అయితే సిబ్బంది కళ్లు గప్పిన ఆ వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి పరారయ్యాడు. దీంతో అతని కోసం ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిశాయని, దీంతో అతన్ని తాము వెన్‌లోక్ హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పామని, అయినప్పటికీ అతను అక్కడికి వెళ్లకుండా పరారయ్యాడని మంగళూరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే అతనికి నిజంగానే కరోనా ఉందా, లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. మరి పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుంటారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!