సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మోసగాళ్లు ఏదో ఒక పద్ధతిని పాటిస్తూ ప్రజల డబ్బును దోచేస్తున్నారు. తాజాగా ఓ మోసగాడు ఓ బాధితుడి డబ్బును చిత్రంగా కాజేశాడు. అదెలాగో తెలిస్తే షాకవుతారు.
ముంబైకి చెందిన ఓంకార్ సావంత్ అనే 24 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ లో జనవరి నెలలో ఓ ఈ-కామర్స్ సైట్‌లో టి-షర్ట్‌ను ఆర్డర్ చేశాడు. కానీ అతనికి వేరే సైజ్‌తో ఉన్న టి-షర్ట్ డెలివరీ అయింది. అయితే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి దాన్ని రిటర్న్ చేద్దామని అనుకున్నాడు. అందులో భాగంగానే గూగుల్‌లో ఆ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెదికాదు. ఒక నంబర్ కనబడింది. దానికి ఫోన్ చేయగా.. అవతలి నుంచి ఒక వ్యక్తి స్పందించాడు. ఆ కంపెనీ ప్రతినిధినని చెప్పాడు.
అయితే టి-షర్ట్‌కు గాను డబ్బును రీఫండ్ చేయాలంటే గూగుల్ పే ఐడీతోపాటు దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను చెప్పాలని కోరాడు. దీంతో ఓంకార్ అలాగే చేశాడు. తరువాత బ్యాంక్ అకౌంట్ నంబర్ చివరి 4 అంకెల నుంచి తన పిన్ నంబర్‌ను తీసివేసి వచ్చే మొత్తాన్ని చెప్పాలని కోరగా అతను అలాగే చేశాడు. తరువాత నిమిషాల వ్యవధిలోనే అతని అకౌంట్ నుంచి రెండు దఫాల్లో మొత్తం రూ.88,421 మాయం అయ్యాయి. దీంతో ఓంకార్ సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేశాడు. అయితే అతని నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని చెప్పిన బ్యాంకు అందుకు తమకు సంబంధం లేదని తెలిపింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కనుక ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రతమత్తంగా ఉండాలి.