చార్లి చాప్లిన్ గురించి తెలియని వారుండరూ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ హాస్యనటుడు చార్లి చాప్లిన్. బ్లాక్ డ్రెస్ కోడ్‌తో.. నెత్తి మీద టోపీ పెట్టుకుని.. చేతిలో కర్ర పట్టుకుని.. గమ్మత్తైన నడకతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు. ప్రస్తుతం ఆయన లేకున్నా.. ఆయన నటించిన సినిమాలు ప్రజలను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈయన సినిమాలు చూస్తేనే చాలు మూడ్ రీఫ్రెష్ అవుతుందనే చెప్పుకోవచ్చు.
చార్లి చాప్లిన్‌ను అనుసరిస్తూ చాలా మంది నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి చార్లి చాప్లిన్‌లా దర్శనమిచ్చాడు. కేవలం వేషమే కాదండోయ్.. సినిమాల్లో చాప్లిన్ చేసే చిలిపి చేష్టలతో అక్కడున్న వారికి నవ్వు తెప్పింస్తుంటాడు. ఇప్పటికే ఇతడి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేస్తూ.. పాపులారిటీని దక్కించుకున్నాడు.
పాకిస్థాన్‌లోని పెషావర్ నగరానికి చెందిన ఉస్మాన్ ఖాన్ (32 ఏళ్లు) కమెడియన్. కొన్నేళ్లుగా నగర వీధుల్లో చార్లి చాప్లిన్ వేషాధారణతో తిరుగుతూ.. ప్రజలను ఆటపట్టిస్తూ.. నవ్విస్తున్నాడు. మొదట్లో ఉస్మాన్ ఖాన్‌ను వింతగా చూసినా.. ఆ తర్వాత అందరి ఆదరణ పెరిగింది. టిక్‌టాక్‌లో తన వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. కేవలం రెండు నెలల్లోనే ఆయనకు 8.50 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగి.. సెలబ్రిటీగా మారిపోయాడు. ప్రస్తుతం అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడుతన్నారు.
చార్లి చాప్లిన్‌గా మారేందుకు గల కారణాన్ని ఉస్మాన్ ఖాన్ ఇలా చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లో ప్రజలు ఎన్నో సమస్యలు, ఒత్తిళ్లతో సతమతమయ్యారని, అప్పుడు తానూ అనారోగ్యంతో మంచాన పడ్డాడన్నారు. కరోనా వల్ల ప్రజల్లో ఆనందం దూరమైందన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు చార్లి చాప్లిన్ సినిమాలు చూశానని, అప్పుడు త్వరగా కోలుకున్నానని చెప్పుకొచ్చారు. మంచి ఉద్యోగం ఉన్నా.. ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెప్పించాలని భావించి.. చార్లి చాప్లిన్‌లా మారానన్నారు.