లగ్జరీ కార్లు ఉంటే చాలా మంది వాటితో స్టంట్లు చేయాలనుకుంటారు. అలాంటి విలాసవంతమైన కార్లతో విన్యాసాలు చేసి థ్రిల్ పొందాలని చూస్తారు. అయితే ఆ వ్యక్తి కూడా తన మెర్సిడెస్ కారుతో అలాగే చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా కారు తగలబడి నష్టం సంభవించడమే కాదు, అతనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న చెస్టర్ హిల్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన 1 లక్ష డాలర్ల విలువ గల మెర్సిడెస్ బెంజ్ కారుతో బర్నవుట్ చేసేందుకు యత్నించాడు. బర్నవుట్ అంటే కారును ఒకటే ప్రదేశంలో గుండ్రంగా తిప్పుతారు. దీంతో టైర్లు వేడెక్కి కింద నుంచి పొగలు వస్తాయి. ఈ ఫీట్‌కు అతను యత్నించాడు. కానీ ఫెయిలయ్యాడు.
కార్‌ను బర్నవుట్ చేయించడం ఫెయిల్ కావడంతో అందులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో కారును నడుపుతున్న వ్యక్తితోపాటు అందులో ఉన్న అందరూ ఒక్కసారిగా కిందకు దిగేశారు. తరువాత ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేశాయి. ఈ క్రమంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే సాధారణంగా కారులోంచి మంటలు వస్తే ఏమీ కాకపోయేది. కానీ అతను స్టంట్ చేసినందుకు అలా అయింది కనుక పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతను కోర్టుకు హాజరు కావల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అత్యంత ఖరీదైన కారు కూడా నాశనం అయింది. అవును.. అలాంటి వాళ్లకు ఇంకో కారును కొనడం పెద్ద సమస్య కాదు కదా. అందుకనే ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు.