ఫాదర్స్ డే సందర్భంగా మనలోకం ప్రత్యేకంగా నిర్వహించిన క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన లభించింది. ఎంతో మంది నెటిజన్లే కాదు, సెలబ్రిటీలూ ఈ క్యాంపెయిన్‌కు స్పందించారు. తమ నాన్నలతో అద్భుతమైన సెల్ఫీలు తీసుకుని మాకు పంపించారు. ఫాదర్స్ డే సందర్భంగా మనలోకం నిర్వహించిన నాన్నతో ఒక సెల్ఫీ (#slefiewithDad , #నాన్నతోఒకసెల్ఫీ) క్యాంపెయిన్‌కు అనేక మంది తమ సెల్ఫీలను పంపించారు.
మనలోకం నాన్నతో సెల్ఫీకి తమ వంతుగా తోడ్పాడు అందించిన ప్రముఖ నటుడు, టీవీ వ్యాఖ్యాత బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి,టీవీ సీరియల్ నటులు రోహిణి, రవికృష్ణ , ప్రముఖ సింగర్ మంగ్లి, లోబో, బిగ్ బాస్ హిమజ, ఆషు రెడ్డిలకు మనలోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. కార్తీకదీపం వంటలక్క కూతురుగా నటించిన బేబీ కృతిక తన తండ్రితో తీసుకున్న సెల్ఫీ షేర్ చేసింది.
కేవలం సెల్ఫీలు తీసుకుని పంపిస్తే చాలా.. ఫాదర్స్ డే అంటే అంతేనా..? అని కొందరికి సందేహం రావచ్చు. కానీ దీని వెనుక ఉద్దేశం సెల్ఫీలు తీసుకోవడం మాత్రమే కాదు.. నాన్నను మనం జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేసే గొప్ప సందేశం ఉంది. సమాజంలో ఎంతో మంది తమ నాన్నలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు ఇంట్లో కలిసి ఉంటున్నా.. ఆయనను పట్టించుకోవడం లేదు. అలాంటి వారు నాన్న ప్రేమకు ఎంతలా దూరమవుతున్నారు, వారు నాన్నలను ఎంతలా మిస్ అవుతున్నారు.. అనే విషయాన్ని తెలియజేసేందుకే ఈ క్యాంపెయిన్ నిర్వహించాం.
చిన్నప్పటి నుంచి మన కోసం నాన్న ఎంతో కష్టపడ్డాడు, మన కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశాడు. అలాంటి నాన్నను మనం మరిచిపోతున్నాం. అలా కాకుండా ఆయన జీవించినంత కాలం ఆయనకు మనం మన ప్రేమను పంచాలి. ఆయన భావాలను పంచుకోవాలి. కేవలం ఫాదర్స్ డే రోజున మాత్రమే కాదు, ఎల్లవేళలా ఆయనతో మనం కలిసి ఉండాలి. ఆయనకు ప్రేమను అందివ్వాలి. మనం ఆయన నుంచి ప్రేమను పొందాలి. అందుకోసమే.. ఆ విషయాలను తెలియజేసేందుకే… మనలోకం #slefiewithDad అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.