మా ఎన్నికల్లో మంచు విష్ణు అధిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనుంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఉదయం 11గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుండి మా ఎన్నికల వేడి మొదలవగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇక ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేశారు. వారిలో మంచు విష్ణు మెజారిటీ ఓట్లతో గెలిచారు. ఇక మంచు విష్ణు గెలుపు తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ కీలక నిర్ణయం తీసుకుంది. మా కార్యవర్గం లో తాము ఉండమని… గెలిచిన పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయంపై నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంచు విష్ణు స్పందించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచు విష్ణు మా సభ్యుల పింఛన్ల పై మొదటి సంతకం కూడా చేశారు.