కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ సహా బీజేపీ నాయకులు కూడా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఆయన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఠాక్రేతో ఎయిర్‌పోర్టు లాంజ్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావీద్, బోసురాజు, వేణుగోపాల్ తదితరులు సమావేశమయ్యారు.
‘‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదు’’ అంటూ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఠాక్రేకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్ వస్తుందని చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం.
‘‘కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. వీడియోలు చూశాక మాట్లాడతా. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. వరంగల్‌లో రాహుల్ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంది’’ మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.