దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బహు భాషా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా రెండు రోజుల్లో మంచి వసూళ్లను అందుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా సాధించిందని సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
తొలిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.78.29కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో రూ.25.86కోట్లు, ఏపీ, తెలంగాణాలో రూ.5.93కోట్లు, కర్ణాటక రూ.5.04కోట్లు, కేరళ రూ.3.70కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.51కోట్లు, ఓవర్సీస్లో రూ.34.25కోట్లు వచ్చినట్లు తెలిపారు. 2022లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లను సాధించిన కోలీవుడ్ చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం మరికొన్ని నెలల్లో విడుదలవ్వనుందని మణిరత్నం ఇటీవల తెలిపారు. ‘‘పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం విడుదలైన 6 నుంచి 9 నెలల తర్వాత రెండో భాగం విడుదలవుతుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు’’ అని చెప్పారు.
ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. భారీ తారాగణంతో మణిరత్నం కలల సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చోళ రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు.