మరియమ్మ లాకప్‌డెత్.. ముగ్గురు పోలీసులపై శాశ్వత చర్యలు

ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో అడ్డగూరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. మరియమ్మ మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఎస్సై మహేశ్వర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జనయ్యలను సర్వీసు నుంచి తొలగించారు. ఆర్టికల్ 311 (2) బి 25 (2) ప్రకారం బాధ్యులపై వేటు వేశారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటివరకూ సస్పెన్షన్‌లో ఉన్నారు. తాజాగా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాగా దొంగతనం కేసు విచారణలో మరియమ్మను  పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే ఆమె లాకప్‌లోనే చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. మరియమ్మ లాకప్‌డెత్‌ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. నిరసనలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి మరియమ్మ మృతిపై పూర్తి విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో మరియమ్మ మృతిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను సీఎం ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో పని చేసిన ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు వేశారు.