తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతుంది. ఊహించని విధంగా పీసీసీ దక్కించుకుని రేవంత్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎక్కడకక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులని సైతం రేవంత్ టార్గెట్ చేసి ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం బాగానే టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది.
గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో పనిచేసిన ఇంద్రకరణ్ 2014లో బిఎస్‌పి పార్టీ తరుపున నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. అలాగే 2018 ఎన్నికల్లో ఈయన టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఈయన ప్రత్యర్ధి కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌లో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై రేవంత్ రెడ్డి నిర్మల్‌లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. అప్పుడే మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
దీనికి కొనసాగింపుగా మహేశ్వర్ రెడ్డి సైతం, ఇంద్రకరణ్‌ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మంత్రిగా ఇంద్రకరణ్ నిర్మల్‌లో చేసిన అభివృద్ధి ఏం లేదని, గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవని, ప్రజలకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. భూకబ్జాలు, కంకర మిషన్ల కోసమే ఇంద్రకరణ్ మంత్రి అయ్యారని ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేందర్‌ని మంత్రివర్గం నుంచి తప్పిస్తే, ఇంద్రకరణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో నిర్మల్‌లో ఇంద్రకరణ్‌కు ఎలాగైనా చెక్ పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రేవంత్ చూస్తున్నారు. అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డి దూకుడుగా నిర్మల్‌లో రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.