గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మహిళ మిస్సయిన అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. అదృశ్యం అయిన దుర్గ ఆచూకీ కోసం పోలీసుల ముమ్మరంగా గాలిస్తునారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల పాటు కువైట్ లో పని చేసిన దుర్గ ఈ నెల 16న దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంది. టెర్మినల్ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, లాంజ్‌లో లగేజీతో ఉన్న దుర్గను పోలీసులు గుర్తించారు. టెర్మినల్ నుంచి బయటకొచ్చిన తర్వాత దుర్గ కనిపించకుండా పోయింది.
ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్గ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్ట్ బయట సీసీ కెమెరాలు పని చేయక పోవడం ఈ కేసుకు టెన్షన్ గా మారిందని చెప్పచ్చు. ఓ వ్యక్తితో ఆమె వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కొన్ని ఛానెళ్లలో దుర్గ దొరికిందని వస్తున్న వార్తలు అవాస్తవమని దుర్గ భర్త సత్యనారాయణ చెబుతున్నారు. కువైట్ నుంచి వస్తున్న సంగతి కూడా తనకు తెలియపరచలేదని చెబుతున్న ఆయన దుర్గ స్నేహితురాలి ద్వారా కువైట్ నుంచి తెలుసుకున్నానని నాలుగు రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు పడుతున్నా ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లేదని చెబుతున్నాడు.