ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కార్ వెనకడుగు వేస్తుంది. ఎన్నికల నిర్వహణ కరోనా కారణంగా వాయిదా వేయాలని ఏపీ ఎన్నికల సంఘానికి స్పష్టంగా చెప్పింది. ఇక హైకోర్ట్ లో కూడా ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాం అని చెప్పిన ఆయన…
త్వరలో విశాఖ లో పరిపాలన రాజధాని ఏర్పాటు కాబోతున్న తరుణంలో కార్యాలయాలకు కేవలం ప్రభుత్వ భూములు ఉపయోగించుకోవాలని నిర్ణయించాం అని వెల్లడించారు. ఈనెల 25 వ తేదీన ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని స్పష్టం చేసారు. రాష్ట్రం లో ఉన్న ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నారు. ప్రభుత్వ భూమి అక్రమిస్తే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు.
భూ అక్రమాలపై సిట్ రిపోర్ట్ పూర్తి అయింది.. త్వరలో సిట్ అధికారులు వెల్లడిస్తారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో పరిస్థితులు అనుకూలిస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తాం అని విజయసాయి రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తాము తొందరపడటం లేదని, పరిస్థితి బాగా లేదని అన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు. అక్రమణదారులపై చర్యలు తప్పవు అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు..కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.