వరంగల్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైదీల ఆరోగ్యంపై తెలంగాణ జైళ్ల శాఖ దృష్టి సారించింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను తరలించనున్నారు. జైళ్లో ఉన్న 960 మంది ఖైదీలను రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది వరంగల్‌కు రానున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైలును సీఎం కేసీఆర్ సందర్శించారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి త్వరలోనే ఖైదీలను తరలించనున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర జైళ్లకు ఖైదీల తరలింపుపై విమర్శలు వినిపిస్తున్నాయి.