తాజాగా ఏపీ బీజేపీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్ర కమలం సారథి సోము వీర్రాజు. మొత్తంగా 40 మంది కొత్త, పాత ముఖాలతో ఆయన ఏర్పాటు చేసుకున్న జట్టు కూర్చు వెనుక చాలా కెమిస్ట్రీనే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆది నుంచి కూడా కులాలకు అతీతంగా పార్టీని ముందుకు నడిపించాలని అనుకున్న సోము.. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవడంతోపాటు.. ఆయన ఏర్పాటు చేసుకున్న జట్టు నుంచి తనకు ఇబ్బందులు లేకుండా, రాకుండా చూసుకోవడం ఒక సంచలన నిర్ణయమైతే.. మరో కోణం కూడా ఉంది.
పార్టీలో తమకు గుర్తింపు లేదని బాధపడుతున్న నేతలను కూడా సోము ఇప్పుడు తన చెంతకు చేర్చుకున్నారు. వీరిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ వంటివారికి చోటు లభించింది. అదే సమయంలో పార్టీకి మౌత్ పీస్‌గా ఉంటూ.. ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న వారికి కూడా ప్రాధాన్యం పెంచారు. ఇలాంటివారు అయితే, పార్టీలో తాను తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించేవారు తగ్గుముఖం పట్టడంతోపాటు తనకు మరింత మద్దతు లభిస్తుందని సోము భావించి ఉంటారనే విశ్లేషణలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి.. అవసరమైతే.. పార్టీ ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నా.. ఇబ్బందులు లేకుండా యువతకు పెద్దపీట వేశారు. అదే సమయంలో జంపింగులకు అవకాశం లేని నేతలకు కూడా అవకాశం ఇచ్చారు. నిజానికి ఇది పార్టీని బలోపేతం చేస్తుందనే చెబుతున్నారు పరిశీలకులు.
గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తాను ఒకటి మాట్లాడితే.. నాయకులు మరొకటి మాట్లాడేవారు. ఇది రాష్ట్ర పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అమరావతికి పార్టీ అనుకూలమని ప్రకటించి.. మిగిలిన జిల్లాల్లో నేతల నోరు నొక్కారనే భావన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సోము వ్యవహరించిన తీరుకు మంచి మార్కులే పడుతున్నాయి.