గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మేయర్ తో బంజారా హిల్స్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశ అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మండిపడ్డారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం అని తెలిపారు. కానీ.. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు.
స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే సీఎంని కలిశానని పేర్కొన్నారు.ఇదే విషయాన్ని సీఎంకి కూడా చాలా స్పష్టంగా చెప్పానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుంచి కొట్లాడిన కుటుంబం తమది అని , ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న నన్ను, మేయర్‌గా అవకాశం ఇచ్చి గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు.