గత ఐదేళ్లలో భారత్‌లో సంస్కరణలు, పనితీరు కలబోతతో వచ్చిన పరివర్తనను చూశామని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. 17వ లోక్‌సభ చివరి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. గత ఐదేళ్లలో బలమైన భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసే అనేక గేమ్ చేంజర్ సంస్కరణలను ప్రవేశపెట్టామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వంటివాటిని ఉదహరించిన ప్రధాని.. ఎన్నో తరాలు వేచిచూసిన అసాధారణ నిర్ణయాలను ఈ లోక్‌సభ కాలంలో తీసుకున్నామని చెప్పారు.
“రాబోయే 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ప్రశ్నపత్రాలు లీకేజ్ యువత పాలిట శాపంగా మారింది. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చట్టం తెచ్చాం. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావి భారతానికి ఎంతో ఉపయోగం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. మేం చేపట్టిన చర్యలతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు సంతోషిస్తాయి. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం.” అని ప్రధాని మోదీ అన్నారు.