సొంతూళ్లకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు కొన్ని ప్రభుత్వాలు ఎలాంటి క్వారంటైన్ వసతులు కల్పిస్తున్నాయో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. తమిళనాడు నుంచి సొంత రాష్ట్రమైన ఒడిశాకు గత కొద్ది రోజుల క్రితం మానస్ పాత్రా అనే 28 ఏళ్ల వలస కార్మికుడు చేరుకున్నాడు. అక్కడి జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో 7 రోజుల పాటు ఉన్నాడు. అయితే కొత్త నిబంధనల ప్రకారం 7 రోజులు క్వారంటైన్ కేంద్రంలో, మరో 7 రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలి. కానీ మానస్ పాత్రాకు కష్టం ఎదురైంది.
7 రోజుల పాటు ఆ క్వారంటైన్ కేంద్రంలో మానస్ ఉన్నాడు. తరువాత 7 రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలని ఆ కేంద్రం అధికారులు అతన్ని పంపించారు. కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారని, తగినంత స్థలం లేదని, క్వారంటైన్‌లో ఉండడం కుదరదని, అది తన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ప్రమాదమని, కనుక తనను మరో 7 రోజుల పాటు అదే కేంద్రంలో ఉండనివ్వాలని అతను అధికారులను వేడుకున్నాడు. అయినప్పటికీ వారు కనికరించలేదు.
అధికారులను ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో మానస్ పాత్రా తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ స్వచ్ఛభారత్ టాయిలెట్‌లో మరో 7 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపాడు. 7 రోజుల పాటు అందులో ఉండి అతను నరకం అనుభవించాడు. అయినా అది చూసిన అధికారులకు అతనిపై జాలి కలగలేదు. కాగా ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడి ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.