గతకొన్ని రోజులుగా లోకేశ్ ప్రవర్తనను గమనిస్తున్నవారు చెబుతున్న మాట… ఆయనకు ఇంకా కుర్రతనం పోలేదని!! అప్పుడే హుందాగా కనిపించినట్లు అనిపించినా.. అంతలోనే ఆయన మాటో, ఆయన ప్రవర్తనో.. ఆ అభిప్రాయాన్ని అబద్దం చేసేస్తుంది అని ఇంకొందరు అభిప్రాయపడుతుంటారు. ఆ అభిప్రాయాలకు విలువనిస్తూ లోకేశ్ ప్రవర్తన కూడా సాగుతుంటుంది. తాజాగా శాసనమండలిలో ఆయన ప్రవర్తన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది! బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న సభలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర ఆక్షేపణ చేస్తున్నారు.
పెళ్లి జరుగుతున్నప్పుడో, బర్త్ డే పార్టీలు జరుగుతున్నప్పుడో, సెలబ్రెటీలు కనిపించినప్పుడో.. అక్కడున్న యువతీయువకులు తమ తమ సెల్ ఫోన్స్ లో ఆ దృశ్యాలను బంధించడానికి అత్యుత్సాహం చూపిస్తుంటారు. అది సరదా.. పైగా కుర్రతనం అని అంటుంటారు అది చూసినవారు! అదే ఆలోచనో లేక నాన్నారు ఉన్నారు నాకేం భయం అనే ధైర్యమో తెలియదు కానీ… మండలి జరుగుతున్న వేళ.. నారా లోకేశ్ తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి.. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు! ఈ పనులను తప్పుపడుతూ.. ఈయన వ్యవహారశైలిని మండలి చరిత్రలో దుర్ధినంగా అభివర్ణిస్తున్నారు వైకాపా నేతలు.
ఈ సందర్భంగా స్పందించిన ఏపీ మంత్రి కురసాల కన్నబాబు.. సభ జరుగుతున్నప్పుడు లోకేశ్ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని, అదో పెద్ద క్రైమ్ అని పేర్కొన్నారు. లోకేశ్ చేసిన పని సభను చులకన చేయటమేనని స్పష్టం చేశారు. తనకున్న అజ్ఞానంతోనో, అవగాహనా రాహిత్యంతోనో, లేక కుర్ర చేష్టలతోనో… సభ్యుల హక్కుల్ని లోకేశ్ కాలరాసారని, నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కన్నబాబు!
ఇంతకూ మండలిలో ఫోటోలు తీయకూడదన్న విషయం లోకేశ్ కు తెలుసా లేదా అనేది మరో ప్రశ్న! ఏది ఏమైనా… తెలిసి చేస్తే నేరం.. తెలియకుండా చేస్తే కుర్రతనం.. అని భావించి రెండో దానికే ఫిక్సవ్వమంటున్నారు తమ్ముళ్లు!! ఈ వ్యవహారంపై మండలి చైర్మన్ ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!!