ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీలో కేబినెట్ చిచ్చు రేగింది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యే తమకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ హొం మంత్రి సుచరిత ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కొన్ని చోట్ల తమ అభిమాన నాయకుల కోసం కొంత మంది రాజీనామాలు చేశారు. కొత్త కేబినెట్ వల్ల వైసీపీలో నెలకొన్న అసంతృప్తి పై భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో వచ్చిన అసంతృప్తి టీ కప్పులో తుపాన్ అని అభివర్ణించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి ఉంటుందని అన్నారు. కానీ అసంతృప్తితో తప్పు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ మరో ఐదేళ్లు సీఎం గా ఉంటారని అన్నారు. ఇప్పుడు మంత్రి పదవి రాని వారికి భవిష్యత్తులో అవకాశం ఇస్తారని తెలిపారు.