రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రైతులకు 7 గంటల పాటు విద్యుత్ ఇవ్వలేమని నాటి కాంగ్రెస్ సీఎం చేతులెత్తేశారన్నారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు ఎకరాలకు మూడు గంటల విద్యుత్ చాలని చెప్పారన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు నాలుగైదు గంటల విద్యుత్ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు విద్యుత్ పైన ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా గాంధీ అయితే ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమని చెప్పారన్నారు. కాంగ్రెస్ ఇష్టారీతిగా మాట్లాడి తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. కరెంట్ లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లు పట్టుకొని చూడాలన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ ఎలా ఉంది? అనే అంశంతో ప్రజల వద్దకు వెళ్దామా? అని సవాల్ చేశారు. వీటిపై ప్రజలను రెఫరెండం కోరుదామా? అని ప్రశ్నించారు.