వర్షాకాలం వచ్చిదంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమని చెప్పారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మంత్రి హరీశ్‌రావు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ నుంచి గురువారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోస్, సీసెక్షన్లు, ఎన్‌సీడీ స్క్రీనింగ్, తదితర అంశాలపై సమీక్షించారు మంత్రి హరీశ్‌రావు.
డెంగ్యూ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. ఒకవైపు అవగాహన పెంచడం, మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి హరీశ్‌రావు. ప్రజలు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు మంత్రి హరీశ్‌రావు.