రాష్ట్రానికి కేంద్రం వరద సహాయం పైన కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఅర్ఎఫ్(NDRF) కు ఎస్డీఅర్ఎఫ్(SDRF) కు తేడా తెలియని వ్యక్తి కిషన్ రెడ్డి అని.. ఆయన కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరమంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్డీఅర్ఎఫ్(NDRF) ప్రత్యేక నిధుల పైన కిషన్ రెడ్డికి అవగాహన లేదని, కేంద్రం ఎన్డీఅర్ఎఫ్(NDRF) ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. అర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా హక్కుగా దక్కె ఎస్డిఅర్ఎఫ్(SDRF) గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఎలాంటి విపత్తు లేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు వస్తాయి. వీటిని తాము ప్రత్యేకంగా ఇచ్చినట్లు కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డిఅర్ఎఫ్(SDRF)కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇయ్యలేదని లోక్ సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్
చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు మంత్రి కేటీఆర్.