ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్ లో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు చేసుకోండి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు అని ఆరోపించారు . రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసనలకు దిగారు. వరంగల్, హనుమకొండతో పాటు ఇతర జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.